- 45 ఏళ్లు దాటితే టీకా
- ఏప్రిల్ 1 నుంచి అమలు
- కేంద్ర మంత్రివర్గ నిర్ణయం
- ఒకటి రెండేళ్లు మాస్క్ తప్పనిసరి
- కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్
దేశంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్-19 టీకాలు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జావడేకర్ విలేకరులకు తెలిపారు. ఇంతవరకు 45-59 ఏళ్ల మధ్య వయసున్నవారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారికే కొవిడ్-19 టీకా ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఇప్పుడు ఎత్తేస్తున్నట్లు జావ్‌డేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన వారంతా కొవిన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొని, అపాయింట్‌మెంట్ తీసుకొని టీకాలు వేయించుకోవాలని కోరారు. దేశంలో వ్యాక్సిన్ కావాల్సినంత అందుబాటులో ఉందని, దానిపై ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న రెండు వ్యాక్సిన్లూ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, ప్రధానమంత్రి కొవాగ్జిన్ తీసుకున్నారని గుర్తుచేశారు. నిపుణుల సూచనల మేరకు కొవిషీల్డ్ రెండో డోస్ తీసుకునే గడువు 4-6 వారాలకు బదులు 4-8 వారాలకు పెంచినట్లు తెలిపారు. రెండో డోస్ సరిగ్గా ఎప్పుడు తీసుకోవాలన్నది వైద్యులు చెబుతారన్నారు. మరో ఒకటి రెండేళ్లు మాస్క్ పెట్టుకోవాల్సి ఉంటుందని, అంతవరకూ భౌతికదూరం, చేతుల శుభ్రత కూడా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment