AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్? కొత్త ఎస్ఈసీ తొలి ప్రకటన అదేనా
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే పడింది. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నీ రావడంతో ఆమె చేసే తొలి ప్రకటన ఈ ఎన్నికల మీదే ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బుధవారం పదవీ విరమణ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హయాంలో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. అలాగే చివరి ప్రెస్ మీట్ లో కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన పదవి నుంచి దిగిపోవడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు తీసుకున్న వెంటనే స్థానిక ఎన్నికలపై ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఆమె తొలి ప్రెస్ మీట్ లోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1న ప్రకటన ఇచ్చి.ఏప్రిల్ 8 లేదా 10వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.
కరోనా వ్యాక్సినేషన్ కు ఈ ఎన్నికలు అడ్డంకిగా మారాయని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏప్రిల్ మొదటివారంలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఏప్రిల్ 1న ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించాలని ఎస్ఈసీని కోరింది. కానీ ఎస్ఈసీ మాత్రం న్యాయపరమైన చిక్కులుండటంతో ప్రకటన చేయలేదు. అలాగే ఏకగ్రీవాలపై అభ్యంతరాలు చెప్పొద్దని ఎస్ఈసీని ఆదేశించింది. ఐతే కరోనా కారణంగా ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడటంతో నోటిఫికేషన్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. బలవంతపు ఏకగ్రీవాల ఫిర్యాదులు, నామినేషన్లు వేసిన వారు, ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో కొంతమంది మరణించడంతో వారి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే ఎన్నికలకు బ్రేక్ పడింది.
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన నేపథ్యంలో.ఏప్రిల్ రెండో వారానికల్లా ఎన్నికల ప్రక్రియ ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటన వస్తే.. 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండటంతో 8, 10వ తేదీలు లేదా.. 12వ తేదీ లోపు ఎన్నికలు ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీలం సాహ్నీ ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ఐతే ఇప్పటికే నామినేషన్లు వేసిన వారు, ఏకగ్రీవంగా ఎన్నికనవారిలో కొందరు మృతి చెందడంతో ఎస్ఈసీ ప్రకటన ఎలా ఉండబోతుందనేది అసక్తికరంగా మారింది
No comments:
Post a Comment