NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Nov 23, 2020

bank transactions

  NewNotifications       Nov 23, 2020

ఒకప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బ్యాంకు బేరర్ చెక్ ఇచ్చే వాళ్లం. కానీ, నేడు దాదాపుగా అందరమూ నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ ఫర్ సమయాల్లో ఒక్క డిజిట్ తేడా వచ్చినా నగదు వేరే వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఒకవేళ వేరే ఖాతాకు బదిలీ అయిపోతే పరిస్థితి ఏంటి? మన నగదు వెనక్కి వస్తుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ పొరపాటుగా భారీ మొత్తంలో నగదు వచ్చి మన ఖాతాలో జమ అయితే. మూడో కంటికి తెలియకుండా ఉంచేసుకోవాలా? లేక బ్యాంకుకు తెలియజేసి నిజాయతీ చాటుకోవాలా

ఇటువంటి సందర్భాల్లో ఖాతాదారులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి? బ్యాంకు నిబంధనలు ఏమిటన్న విషయంపై అవగాహన ఉంటే మంచిది. శాంతి ఓ రోజు ఐసీఐసీఐ బ్యాంకులోని తన ఖాతా నుంచి రూ.30 వేలను ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే, ఖాతా నంబర్ చివరి మూడు అంకెలు 339 ఉంటే ఆమె 399 ఎంటర్ చేసి ట్రాన్స్ ఫర్ చేసేసింది. దీంతో నగదు వేరే వారి ఖాతాకు వెళ్లిపోయింది. జరిగిన పొరపాటును గుర్తించిన శాంతి వెంటనే బ్యాంకు శాఖకు వెళ్లి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. కానీ, లాభం లేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత ఆమె మరోసారి బ్యాంకుకు వెళ్లి విచారించింది. మరోసారి దరఖాస్తు కూడా సమర్పించింది. ఎన్నో మెయిల్స్ కూడా పెట్టింది. చివరికి బ్యాంకు నుంచి వచ్చిన సమాధానం విని ఆమె కంగుతింది. అదేమిటంటే, ఆమె ట్రాన్స్ ఫర్ చేసిన నగదు జమ అయిన ఖాతాదారుని అనుమతి లేకుండా. ఆ నగదును తిరిగి వెనక్కి బదిలీ చేయలేమని బ్యాంకు సిబ్బంది చెప్పారు. 

మరో ఉదాహరణ చూస్తే. చరణ్ తన సోదరి కార్తీక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు కానుకగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతా ద్వారా ఆన్ లైన్ లో 1 లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఖాతా నంబర్ లో ఒక అంకె పొరపాటుగా ఎంట్రీ చేశాడు. దాంతో ఆ నగదు కార్తీక ఖాతాను చేరలేదు. బదులుగా వేరొక ఖాతాకు వెళ్లిపోయింది. చరణ్ బ్యాంకుకు వెళ్లి విచారిస్తే తెలిసిన విషయం అది. ‘బెనిఫీషియరీ డిటైల్స్ ను యాడ్ చేసుకుని పంపించాను, అన్నీ కరెక్ట్ గా ఇస్తేనే అకౌంట్ యాడ్ అవుతుంది. కేవలం ఒక్క అంకె తేడాతో అలా ఎలా వెళ్లిపోతుంది’ అని అతడు ప్రశ్నించాడు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సమస్య పరిష్కారం కాలేదు.

కానీ, అది పొరపాటు

అకౌంట్ నంబర్, ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తో నెట్ బ్యాంకింగ్ లో బెనిఫీషియరీ వివరాలను యాడ్ చేసుకుంటామని తెలిసిందే. అకౌంట్ నంబర్, పేరు మ్యాచ్ అవకపోతే లావాదేవీ ఫెయిల్ అవుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఆర్ బీఐ మార్గదర్శకాల ప్రకారం నగదు ట్రాన్స్ ఫర్ కు ఖాతా నంబరే ముఖ్యం. ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్ సీ నంబర్ అనేవి బ్యాంకు తరఫున చెక్ చేసుకునేందుకు ఇచ్చే అదనపు సమాచారం మాత్రమే. ప్రతీ లావాదేవీ సమయంలో ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ ను కూడా మ్యాచ్ చేసి చూడాలని ఆర్ బీఐ బ్యాంకులకు సూచించింది. కానీ ఇది సూచన మాత్రమే. తప్పనిసరి కాదు.  

జమ చేసేవారిదే బాధ్యత

ఆర్ బీఐ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే. ఖాతా నంబర్, ఖాతాదారుని పేరు, నగదు మొత్తం సహా అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నగదు పంపిస్తున్నవారిపైనే ఉంటుంది. పొరపాటుగా వెళ్లి ఆ నగదు వేరొకరి ఖాతాలో జమ అయితే బాధ్యత అవతలి వారిపై ఉండదు. ఇలా పొరపాటుగా పంపించిన వారు తిరిగి తమ నగుదును వెనక్కి పొందడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ.

ఎందుకంటే.

మనీ ట్రాన్స్ ఫర్ సమయంలో ఖాతా వివరాలను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పంపించే వారిపైనే ఉంటుంది. అయితే, పొరపాటుగా వేరొక ఖాతా నంబర్ ఎంటర్ చేసినట్టయితే నిజానికి ఆ నంబర్ పై ఎలాంటి ఖాతా లేకుంటే మాత్రం ఆ నగదు వెనక్కి వస్తుంది. ఒక్కోసారి ఐఎఫ్ఎస్ సీ కోడ్ లో తప్పు ఉన్నా లావాదేవీ ఫెయిల్ అయ్యి నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఫెయిల్ అయిన లావాదేవీల నగదును బ్యాంకులు తిరిగి ఖాతాలో జమ చేస్తాయి. ఒక్కోసారి ఆర్టీజీఎస్ సస్పెన్స్ అకౌంట్ లో కూడా ఉంచవచ్చు. అప్పుడు ఖాతాదారులే స్వయంగా ఫిర్యాదు ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఒకవేళ పొరపాటుగా వేరే ఖాతా నంబర్ కు నగదు వెళ్లినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాలి. అప్పుడు బ్యాంకు సిబ్బంది బెనిఫీషియరీతో మాట్లాడి జరిగిన తప్పిదాన్ని వివరిస్తారు. పొరపాటుగా జమ అయిన ఆ మొత్తాన్ని రివర్ట్ చేసుకునేందుకు అనుమతి కోరతారు. వారు సరేనంటే సమస్య పరిష్కారమైనట్టే. ఒకవేళ మీ సొంత బ్యాంకు శాఖ మేనేజర్ సరిగా స్పందించకుంటే ఆ నగదు పొరపాటుగా క్రెడిట్ అయిన బ్యాంకు శాఖను సంప్రదించాలి. అకౌంట్ స్టేట్ మెంట్, పాస్ బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్నీ వెంట తీసుకెళ్లి జరిగిన సందర్భాన్ని వివరించడం ద్వారా సాయం పొందవచ్చు. 

కానీ, కొంత మంది మాత్రం డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకోరు. అప్పటికే ఖర్చు కూడా చేసి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఖాతాదారుడు డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాంకులు కూడా ఏమీ చేయలేవు. పొరపాటుగా పంపిన వారికి నగదు వెనక్కి రావడం దుర్లభం.

ఎందుకు బ్యాంకులు వెనక్కి తీసుకోలేవు?

ఉదాహరణకు చరణ్ తన సోదరి కార్తీకకు బదులు పొరపాటుగా వేరొకరికి లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. చరణ్ వాదన ప్రకారం పొరపాటుగా తన సోదరికి బదులు వేరొకరి ఖాతాకు బదిలీ అయిందని. కానీ, వాస్తవానికి చరణ్, బెనిఫీషియరీ మధ్య ఎటువంటి లావాదేవీలు ఉన్నాయో? బ్యాంకుకు తెలియదు కదా. పొరపాటుగా వెళ్లిందా? లేక ఇరువరి మధ్య లావాదేవీల్లో భాగంగా బదిలీ జరిగిందా? అన్న నిజనిర్ధారణ బ్యాంకుల పని కాదు. అందుకే నగదును ఖాతాదారుడి అనుమతి లేకుండా అతడి ఖాతాలోంచి వెనక్కి తీసుకుంటే అది బ్యాంకు, ఖాతాదారుడి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కనుక బ్యాంకులు తమంతట తాము తిరిగి వెనక్కి తీసుకుని ఆరోపిస్తున్న వ్యక్తి ఖాతాకు జమ చేయవు. ఇలా చేస్తే అప్పుడు చాలా మంది తాము పొరపాటుగా పంపామంటూ వచ్చి ఎంచక్కా నగదును వెనక్కి తీసేసుకుంటారు.

అంతిమ మార్గం

అయినా మీకు న్యాయం లభించకుంటే న్యాయపరమైన ప్రక్రియను అనుసరించడమే మిగిలి ఉన్న మార్గం. కానీ న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అంటే ధన వ్యయం, కాల వ్యయంతో కూడుకుని ఉంటుందన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. పైగా కోర్టులో లావాదేవీ మీ తప్పిదం కారణంగానే జరిగిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ మీ ఖాతాలోనే పొరపాటుగా నగదు జమ అయితే?

పైన చెప్పుకున్నట్టు మీ ఖాతాకు వేరెవరో పొరపాటుగా నగదు జమ చేస్తే ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది మీ ఇష్టమే. కానీ, పంపిన వారు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జమ ఎవరి నుంచి, ఎందుకు వచ్చిందన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.  ఒకవేళ సమర్పించలేకపోతే నగదును వెనక్కి తిరిగి ఇవ్వడంతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నగదు మీదే అని చెబితే ఆదాయపన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.50వేలకు మించి నగదు లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ యంత్రాంగం కన్నేసి ఉంచింది. వారు నోటీసు ఇస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

నగదు పంపే ముందు ఇలా చేస్తే బెటర్

మనవైపు పొరపాటు ఉంచుకుని నెపం బ్యాంకులపైన, మన నగదును అందుకున్నఅజ్ఞాత వ్యక్తిపైన మోపితే లాభం లేదు. ముందు జాగ్రత్తలు అవసరం. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి బెనిఫీషియరీ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ నంబర్లను యాడ్ చేసుకునే సమయాల్లో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఖాతా నంబర్ ను ఎడమవైపు నుంచి కుడి వైపునకు చదవడం మనకు అలవాటు. అయితే, నగదు లావాదేవీల సమయంలో ఖాతా నంబర్లను ఒకసారి కుడిచేతి వైపు నుంచి ఎడమవైపునకు చదవి క్రాస్ చెక్ చేసుకోవడం మంచి విధానం. దీని కంటే ఉత్తమమైనది ఏమంటే.? ముందు అకౌంట్ డిటైల్స్ యాడ్ చేసుకుని ఎన్ఈఎఫ్టీ లావాదేవీలో కేవలం ఒక రూపాయిని  మాత్రమే మొదటిసారి ట్రాన్స్ ఫర్ చేసి చూడాలి. అది అవతలి వ్యక్తి ఖాతాను చేరిందా? లేదా? చూసుకుని అప్పుడు అసలు మొత్తాన్ని కావాలనుకుంటే ఎన్ఈఎఫ్టీలోనూ లేదంటే ఆర్టీజీఎస్ లోనూ పంపించుకుంటే సరి. 

logoblog

Thanks for reading bank transactions

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...